TTD Colleges: ఎస్‌పీడ‌బ్ల్యూ, ఎస్వీ, ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్ కళాశాలకు అటానమస్ హోదా

Sada Bhargavi

TTD Colleges: తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి డిగ్రీ పీజీ క‌ళాశాల‌ (Sri Padmavathi Degree And PG College), ఎస్వీ డిగ్రీ కళాశాల (Sri Venkateswara Degree College), శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాల (Govindaraja Swamy Arts College)కు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 10 సంవత్సరాల పాటు అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా మంజూరు చేసింద‌ని జేఈవో స‌దా భార్గవి తెలిపారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి అతిథి భ‌వ‌నంలో శుక్రవారం జేఈవో మీడియా స‌మావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యా సంస్థలలో మూడు క‌ళాశాల‌ల‌కు అటాన‌మ‌స్ హోదా ల‌భించిన‌ట్లు చెప్పారు. ఈ హోదాతో టీటీడీ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యాప్రమాణాలు, కళాశాలల అభివృద్ధికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంద‌న్నారు. విద్యావిధానం, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్ లో మార్పులు చేసుకోవడానికి వీలవుతుంద‌ని చెప్పారు. త‌ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి త‌గ్గుతంద‌న్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సామాజిక సేవా దృక్పథంతో విద్యా బోధన, ఆధునిక సాంకేతికత ఆధారంగా కోర్సుల నిర్వహణ, మెమరీ బేస్డ్ విద్యావిధానం ఏర్పాటుకు వెసులుబాటు కలుగుతుంద‌న్నారు. ప్రాంగణ ఎంపికలకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తామ‌ని వివ‌రించారు.

ఇదీ కళాశాలల చరిత్ర

  • రాయలసీమ జిల్లాలకు చెందిన నిరుపేద పిల్లల విద్యా అవసరాలను తీర్చడానికి తిరుపతిలో వివిధ విద్యా సంస్థల‌ను టీటీడీ ఏర్పాటు చేసింది. ఇందులో 1945లో 80 మంది విద్యార్థులతో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రారంభమైంది. ప్రస్తుతం క‌ళాశాల నిర్వహిస్తున్న‌ 22 కోర్సుల‌లో 2,700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2022 సెప్టెంబర్ 13న కళాశాల న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు పొందింది.
  • 1952లో శ్రీ ప‌ద్మావ‌తి డిగ్రీ, పీజీ క‌ళాశాల ప్రారంభమైంది. ప్రస్తుతం క‌ళాశాల నిర్వహిస్తున్న 26 కోర్సుల‌లో 2,800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2022 మే 10న కళాశాల న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు పొందింది.
  • 1952లో ఎస్‌జీఎస్ ఆర్ట్స్‌ క‌ళాశాల ప్రారంభమైంది. ప్రస్తుతం క‌ళాశాల నిర్వహిస్తున్న 19 కోర్సుల్లో 1,850 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2023 మార్చి 30న కళాశాల న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు పొందింది.

ఛైర్మన్, ఈవో అభినందన
టీటీడీకి చెందిన ఎస్‌పీడ‌బ్ల్యూ, ఎస్వీ, ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్ కళాశాలకు అటానమస్ హోదా లభించడానికి కృషి చేసిన టీటీడీ జేఈవో సదా భార్గవి, విద్యాశాఖాధికారి భాస్కర్ రెడ్డి, టీటీడీ విద్యా సంస్థల సలహాదారు హన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాళ్లు నారాయణమ్మ, వేణుగోపాల్ రెడ్డి, మ‌హ‌దేవ‌మ్మ, కళాశాల అధ్యాపక బృందాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *