Singanamala MLA: నేను మాట్లాడిందేమిటి? ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది ఏమిటి?

Jonnalagadda Padmavathi: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై శింగనమల ఎమ్మెల్యే (Singanamala MLA) జొన్నలగడ్డ పద్మావతి (Jonnalagadda Padmavathi) స్పందించారు. తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె ఏమన్నారంటే.. ‘నేను మాట్లాడింది నీటి గురించి మాత్రమే, జిల్లా స్థాయిలో తెగాల్సిన నీటి సమస్యను సీఎంఓ స్థాయికి తీసుకెళ్లారని అధికారులను ఉద్దేశించి అన్నాను. అందరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళం అయినప్పటికీ ఎవరికివారు నియోజకవర్గ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తారు. ఈ క్రమంలో నేను పక్క నియోజకవర్గాల వారితో పోరాటం చేయాల్సి వస్తోందని అన్నాను. ఇలాంటి పోరాటం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనూ జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ జరిగింది. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి.

ఎమ్మెల్యే టికెట్ గురించి ప్రశ్నలు అడిగినప్పుడు, జగనన్న అప్పచెప్పిన బాధ్యతను మేము చేసాం, ఆయన స్ఫూర్తితోనే నియోజకవర్గ ప్రజలకు మా చేతనైంది చేశామని సమాధానం ఇచ్చాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు లేకపోతే 40 ఏళ్లుగా పరిష్కారం కాని శింగనమల చెరువు లోకలైజేషన్ సాధ్యం అయ్యేదా? మిగులు జలాలను మా నియోజకవర్గ చెరువులకు కేటాయించుకోవడం అయ్యే పనేనా? సీఎం రిలీఫ్ ఫండ్ మొదలుకొని ఎన్నో రకాలుగా మా నియోజకవర్గ ప్రజలను ఉదారంగా ఆయన ఆదుకున్నారు. ఇవన్నీ మర్చిపోతామని ఎలా అనుకున్నారు?

అనవసరంగా ఎక్కడికక్కడ నా మాటలను వక్రీకరించి, పద్మావతి పార్టీకి గుడ్ బై చెబుతోందని, ఎదురు తిరిగిందని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేను, నా భర్త ఆలూరు సాంబశివారెడ్డి జగనన్నకు విధేయులం. రాజకీయంగా ఓనమాలు తెలియని మమ్మల్ని జగనన్న ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. మాది రాజకీయ కుటుంబం కాదు, అనవసర రాజకీయాలు చేయడం మా చేతకాదు. మాకు తెలిసిందల్లా ఒక్కటే, మాకు చేతనైందల్లా ఒక్కటే. అది జగనన్న అడుగుజాడల్లో నడవడం మాత్రమే’ అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *